Monday, April 20, 2026

ఆలోచన లేనిపని చేయకూడదు


ఆలోచన లేనిపని చేయకూడదు

భారతదేశంలో గల పురాతన నగరాలలో పురుకుత్సం అనేది ఒకటుండేది. అందులో మార్తాండుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను దైవభక్తి పరాయణుడు, పాపభీతి గలవాడు, మంచివాడు. అతనికి ఒకే ఒక చింత ఉండేది. అది సంతానలేమి. సంతానంకోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేశారు మార్తాండుడు అతని భార్య భోలి.

ఎంతో వేడుకొన్నందుకో లేక అతని పూజ సఫలం అయినందు వల్లనో గానీ ఎట్టకేలకు అతనికి ఒక సుపుత్రుడు కలిగాడు. మార్తాండుని ఆనందానికి అంతులేదు. అతని కుమారుని జననవార్త తన ఇరుగుపొరుగు వ్యక్తులతో పాలుపంచుకోవాలని బయలుదేరాడు. అతను ఇంటి తలుపు తీసినంతనే ఆ తలుపుచాటున ఒక పిల్ల ముంగీస అరుస్తూ కనబడింది. మార్తాండుడు దానిని తిప్పి పంపేందుకు ప్రయత్నించాడు. కానీ అది ఆ ఇంటిని, అతనిని వదలి వెళ్ళక అక్కడనే తచ్చాడుతున్నది.

మార్తాండుడు ముంగీస పిల్లను దేవుడే తనవద్దకు పంపాడని భావించి దాన్ని తీసుకొని పెంచుకోవడానికే నిశ్చయించుకున్నాడు. మార్తాండుడు తన బిడ్డతో పాటుగానే ముంగీసను కూడా అల్లారుముద్దుగా పెంచసాగాడు. చుట్టుప్రక్కల వాళ్ళు మార్తాండునితో “ముంగీస నీ రెండో కొడుకా?” అని అడుగుతూ వేళాకోళమాడేవారు.

అలా కొంతకాలం గడిచింది. మార్తాండు, అతని భార్య భోలి, ఇద్దరూ తమకు లేకలేక కలిగిన సంతానంపై ఈగ కూడా వాలకుండా పెంచుకుంటున్నారు. ఒకనాడు మార్తాండుని భార్య భోలి దగ్గరలో గల నదిలో స్నానానికి వెళ్ళింది. అక్కడే బట్టలు కూడా ఉతుక్కుంటారు. వెళుతూ పిల్లవాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని భర్త మార్తాండునికి అప్పగించి వెళ్ళింది. మార్తాండుడు కూడా పిల్లవాని ఉయ్యాల దగ్గరే ఉండి పిల్లవానికి నిద్రాభంగం కాకుండా చూస్తున్నాడు.

అదే సమయంలో ఆ దేశపు మహారాజుగారు అత్యవసర పనిమీద మార్తాండుని రాజసభలో తక్షణం హాజరుకావాలని తన భటులతో కబురుపంపాడు. మార్తాండునికి ఏమిచేయాలో పాలుపోలేదు. ఇంట్లో ఇంకా ఎవరూలేరు. తన భార్య రేవుకు వెళ్ళింది. ఆమె రావడానికి రెండు మూడు గంటలు పడుతుంది. రాజుగారు సభకు తక్షణం రమ్మని కబురు పంపారు. ఆలస్యం చేస్తే రాజుగారు కోపగించుకుని దండిస్తారేమో! రాజుగారి దండన అంటే కఠినంగా ఉంటుంది. ఇలా పరిపరివిధాలుగా ఆలోచించి చివరకు రాజసభకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు.

పిల్లవాడికి నిద్రాభంగం కలగకుండా చూసుకోమని తన ముంగీసకు చెప్పి తలుపు దగ్గరగా వేసి రాజుగారి వద్దకు బయలుదేరాడు. పిల్లవాని ఉయ్యాల వద్ద గల ఒక ఎత్తైన బల్లపైన ముంగీస కూర్చుని పిల్లవానిని చూస్తూ ఉన్నది. పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు.

ఇంతలో ఒక నల్లత్రాచుపాము ఒకటి ఆ ఇంట్లోకి ప్రవేశించింది. అది అటూ ఇటూ తిరుగుతూ బుసలుకొడుతూ పసిపిల్లవాడు నిద్రిస్తున్న ఉయ్యాల దగ్గరకు వచ్చింది. అంతేగాక చకచకా ఉయ్యాల పైకి ఎగబాకడం మొదలుపెట్టింది. పిల్లవానిని కంటికి రెప్పలాగా చూస్తున్న ముంగీస కంట్లో అది పడింది. అంతే ముంగీస ఊరుకుంటుందా? ఒక్క ఉదుటున దానిపైకి దూకింది. రెండూ క్రిందపడ్డాయి. జాతివైరం కదా! భీకరంగా పోట్లాడుకున్నాయి. ముంగీస ఎట్టకేలకు పాము మెడను ఉడిసిపట్టుకుని కసుక్కున కొరికింది. అంతే గిలగిలా కొట్టుకుంటూ పాము ప్రాణాలు విడిచింది.

ముంగీస కసి తీరలేదు. ఆ పామును ముక్కలుగా చేసింది. గదంతా రక్తసిక్తమైంది. ముంగీస మూతికి, వంటికి రక్తం అంటుకున్నది.

ఈలోగా రాజుగారి వద్దకువెళ్ళిన మార్తాండుడు మళ్ళా యింటికి వచ్చాడు. తలుపు తెరిచాడు. యజమాని వచ్చాడన్న ఆనందంతో ముంగీస అతనికి ఎదురేగింది. రక్తసిక్తమైఉన్న ముంగీస నోటిని చూచి యజమాని నోట మాటరాలేదు. ఆందోళన పెరిగింది. పిల్లవాడిని ఒంటరిగా ఒక మృగానికి అప్పగించి వెళ్ళడం తనదే పొరపాటని లేక లేక కలిగిన పిల్లవాడిని ఈ ముంగీస దారుణంగా చంపి ఉంటుందని భావించి తన ఒరలో కత్తిని తీసి ఒక్కవేటుతో కోపంగా ముంగీసను నరికి చంపాడు మార్తాండుడు. గిల గిల కొట్టుకుని ముంగీస మరణించింది.

ఇంటిలోనికి పోయిచూసిన మార్తాండుడు నిశ్చేష్టుడయ్యాడు. పిల్లవాడు ఊయలలో ఆదమరచి నిద్రపోతున్నాడు. గది అంతా రక్తసిక్తమైంది. నల్లత్రాచు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నది. పరిస్థితి అర్థమైన మార్తాండుడు “అయ్యో! నాకు మేలుచేసిన ముంగీసను తొందరపాటుతో పొరపడి చంపేశానే!” అని విచారించాడు. ఈలోగా నదికివెళ్ళిన మార్తాండుని భార్య భోలి కూడా వచ్చింది. భర్తచేసిన పనికి ఎంతగానో విచారించింది.

అందుకనే ‘ఆలోచన లేని పనికూడదు’ అన్నారు. అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments